Jude
యూదా రాసిన పత్రిక
పరిచయం
౧ తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. ౨ దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక.
పత్రిక రాసిన సందర్భం - భ్రష్టత్వం
౩ ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయాలనిపించింది. ౪ ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది.
భ్రష్టత్వం ఉదాహరణలు
౫ ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. ౬ తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
౭ అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.
భ్రష్ట బోధకుల వర్ణన
౮ అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని గొప్ప దూతలను గురించి చెడుగా చెబుతున్నారు. ౯ అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు. ౧౦ కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ౧౧ వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.
౧౨ వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు. ౧౩ సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది.
౧౪ ఆదాము నుండి ఏడవవాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. ౧౫ వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.” ౧౬ వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషుల్ని పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
౧౭ కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. ౧౮ చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. ౧౯ వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.
నిజ విశ్వాసులకు ఆదరణ, వారికున్న ఏడు బాధ్యతలు
౨౦ కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ౨౧ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. ౨౨ అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. ౨౩ అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తుల్ని సైతం మీరు అసహ్యించుకోండి. ౨౪ మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. ౨౫ ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.