Home

1 తిమోతికి

అధ్యాయం: 1 2 3 4 5 6


-Reset+

చాప్టర్ 1

1 మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు,
2 విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
3 నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
4 విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
5 ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
6 ​కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
7 ​నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
8 ​అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము,
9 ​ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,
10 ​హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
11 ​నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.
12 ​పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
13 ​నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
14 ​మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.
15 ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
16 ​అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
17 సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.
18 నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు.
20 వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.