7
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన పౌలును గూర్చినది ఈ పాట. 
 1 యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను. 
నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము. 
 2 నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను. 
నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు. 
 3 యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు. 
 4 నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు. 
నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు. 
 5 కానీ నేను పాపము కలిగియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము. 
నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద తొక్కనిమ్ము. 
మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము. 
 6 యెహోవా, లెమ్ము నీ కోపాన్ని చూపెట్టుము. 
నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము. 
లేచి న్యాయంకోసం వాదించుము. 
 7 జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి, 
వారి మీద పైనుండి పరిపాలించుము. 
 8 ప్రజలకు తీర్పు తీర్చుము యెహోవా, నాకు తీర్పు తీర్చుము. 
నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము. 
నేను నిర్దోషిని అని రుజువు చేయుము. 
 9 చెడ్డవాళ్లను శిక్షించి 
మంచివాళ్లకు సహాయం చేయుము. 
దేవా, నీవు మంచివాడవు, 
మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు. 
 10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు. 
కనుక దేవుడు నన్ను కాపాడుతాడు. 
 11 దేవుడు మంచి న్యాయమూర్తి, 
మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. 
 12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే 
ఆయన తన మనస్సు మార్చుకోడు. 
 13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది. 
 14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. 
అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు. 
 15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు. 
అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు. 
 16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు. 
ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు. 
అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు. 
 17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను. 
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.