26
దావీదు కీర్తన. 
 1 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. 
యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. 
 2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. 
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము. 
 3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. 
నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను. 
 4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో 
నేను ఒకడ్ని కాను. 
 5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. 
ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను. 
 6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. 
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. 
 7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. 
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను. 
 8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. 
మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను. 
 9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. 
ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. 
 10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. 
చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు. 
 11 కానీ నేను నిర్దోషిని. 
కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము. 
 12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. 
యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.