141
దావీదు స్తుతి కీర్తన. 
 1 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. 
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము. 
త్వరపడి నాకు సహాయం చేయుము. 
 2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము. 
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము. 
 3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. 
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము. 
 4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు. 
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము. 
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను బాగస్థుడను కాకుండా చేయుము. 
 5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. 
అది నాకు మంచిదే. 
వారి విమర్శను నేను అంగీకరిస్తాను. 
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది. 
 6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు. 
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు. 
 7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది. 
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడుతాయి. 
 8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను. 
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము. 
 9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము. 
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము. 
 10 నేను హాని లేకుండా తప్పించుకొనగా ఆ దుర్మార్గులు 
తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.