నహూము  
 1
 1 ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం. 
నీనెవె పట్ల యెహోవా కోపం 
 2 యెహోవా రోషంగల దేవుడు! 
యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు. 
యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు. 
ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు. 
 3 యెహోవా ఓర్పు గలవాడు 
కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు. 
యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు. 
ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు. 
దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు. 
మానవుడు నేల మీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు! 
 4 యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది. 
ఆయన నదులన్నీ ఇంకి పోయేలా చేస్తాడు! 
బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి నశించి పోతాయి. 
లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి. 
 5 యెహోవా వస్తాడు. 
పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి. 
కొండలు కరిగిపోతాయి. 
యెహోవా వస్తాడు. 
భయంతో భూమి కంపిస్తుంది. 
ఈ ప్రపంచం, అందులో నివసించే 
ప్రతివాడూ భయంతో వణుకుతారు. 
 6 యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు. 
ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు. 
ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది. 
ఆయన రాకతో బండలు బద్దలై చెదిరి పోతాయి. 
 7 యెహోవా మంచివాడు, 
ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం. 
ఆయనను నమ్మిన వారి పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. 
 8 ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు. 
ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు. 
ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు. 
 9 యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు? 
కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు. 
కష్టం రెండువ సారి రాదు. 
 10 చిక్కు పడిన ముండ్ల పొదలా 
నీ శత్రువు నాశనం చేయబడతాడు. 
ఎండిన కలుపు మొక్కల్లా 
వారు వేగంగా కాలిపోతారు. 
 11 అష్షూరూ, నీలో నుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరంగా దుష్ట పథకాలు వేశాడు. 
అతడు చెడు సలహా ఇచ్చాడు. 
 12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు: 
“అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు. 
వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు. 
వారంతా అంతం చేయబడతారు. 
నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను. 
కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను. 
 13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను. 
మీ మెడ మీద నుండి ఆ కాడిని తీసివేస్తాను. 
మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.” 
 14 అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. 
“నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. 
నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, 
చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను 
నేను నీ కొరకు నీ సమాధిని నేను తయారు చేస్తున్నాను. 
నీవు ముఖ్యుడవు కావు!” 
 15 యూదా, చూడు! 
పర్వతాల మీద నుండి వస్తున్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక దూత ఇక్కడికి వస్తున్నాడు! 
శాంతి ఉన్నదని అతడు చెపున్నాడు! 
యూదా, నీ ప్రత్యేక పండుగలను జరుపుకో! 
యూదా, నీవు మాట ఇచ్చిన వాటిని నెరవేర్చు. 
దుష్ట జనులు మళ్లీ నీ మీద దాడి చేసి నిన్ను ఓడించలేరు! 
ఆ దుష్ట జనులందరూ నాశనం చేయబడ్డారు.