68
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. 
 1 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము. 
ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక! 
 2 గాలికి ఎగిరిపోయే పొగలా 
నీ శత్రువులు చెదరిపోవుదురుగాక. 
అగ్నిలో మైనం కరిగిపోయేలా 
నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక. 
 3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు. 
మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. 
 4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి. 
ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు. 
ఆయన పేరు యాహ్.* యాహ్ ఇది హీబ్రూ భాషలో దేవునికున్న పేర్లలో ఒకటి. 
ఆయన నామాన్ని స్తుతించండి. 
 5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. 
దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు. 
 6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. 
దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. 
కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు. 
 7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు. 
ఎడారిగుండా నీవు నడిచావు. 
 8 భూమి కంపించింది. 
దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది. 
 9 దేవా, నీవు వర్షం కురిపించావు 
మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు. 
 10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. 
దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచి వాటిని యిచ్చావు. 
 11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 
నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు. 
 12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి. 
యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు. 
 13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను సంచుకొంటారు. 
వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.” 
 14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు. 
వారు పడిపోతున్న మంచులా ఉన్నారు. 
 15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. 
 16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు? 
దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. 
యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు. 
 17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు. 
ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి. 
 18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. 
ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. 
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను 
వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు† కానుకలు తీసుకొన్నాడు ‘ఆయన మనుష్యులను కానుకగా స్వీకరించాడు” లేదా “ఆయన మనుష్యులకు కానుకలనిచ్చాడు.” ఇది ప్రాచీన సిరియాక్ మరియు అరమేయిక్ తర్జుమాల ప్రకారం. ఎఫెసి. 4:8 చూడండి. 
 19 యెహోవాను స్తుతించండి. 
మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. 
దేవుడు మనల్ని రక్షిస్తాడు. 
 20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. 
మన యోహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు. 
 21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.‡ దేవుడు … చూపిస్తాడు అక్షరార్థముగా దేవుడు తన శత్రువుల తలలను చితుకగొడతాడు. 
దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు. 
 22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. 
సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. 
 23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు 
కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” 
 24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. 
నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు. 
 25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. 
మధ్యలో ఆడపడుచులు తంబరలు వాయిస్తారు. 
 26 మహా సమాజంలో దేవుని స్తుతించండి. 
ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి. 
 27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. 
యూదా మహా వంశం అక్కడ ఉంది. 
జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు. 
 28 దేవా, నీ శక్తి మాకు చూపించుము, 
దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము. 
 29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు, 
యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు. 
 30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. 
ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము 
ఆ రాజ్యాలను యుద్ధంలో 
నీవు ఓడించావు. 
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి 
తీసుకొని వచ్చు నట్లు చేయుము. 
 31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము. 
దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము. 
 32 భూ రాజులారా దేవునికి పాడండి. 
మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి. 
 33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు. 
ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి. 
 34 మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు. 
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు. 
 35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు. 
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తి, బలాన్ని ఇస్తాడు. 
దేవుని స్తుతించండి. 
*68:4: యాహ్ ఇది హీబ్రూ భాషలో దేవునికున్న పేర్లలో ఒకటి.
†68:18: కానుకలు తీసుకొన్నాడు ‘ఆయన మనుష్యులను కానుకగా స్వీకరించాడు” లేదా “ఆయన మనుష్యులకు కానుకలనిచ్చాడు.” ఇది ప్రాచీన సిరియాక్ మరియు అరమేయిక్ తర్జుమాల ప్రకారం. ఎఫెసి. 4:8 చూడండి.
‡68:21: దేవుడు … చూపిస్తాడు అక్షరార్థముగా దేవుడు తన శత్రువుల తలలను చితుకగొడతాడు.