4
 1 ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు.  2 “ప్రతి గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని ఏర్పరచి  3 యాజకుల కాళ్లు నిలిచిన స్థలం లో యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని బయటికి తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేసే చోట వాటిని నిలబెట్టమని వారి కాజ్ఞాపించు.” 
 4 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరచిన పన్నెండు మందిని, అంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్కరిని పిలిపించి,  5 వారితో ఇలా అన్నాడు. “యొర్దాను మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట నుండి, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున ప్రతివాడూ ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవాలి.  6 ఇక మీదట మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, ‘యెహోవా మందసం ముందు యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి.  7 యొర్దానును దాటుతుండగా యొర్దాను నీళ్లు ఆగిపోయాయి కాబట్టి ఈ రాళ్లు చిరకాలం ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధంగా ఉంటాయి’ అని వారితో చెప్పాలి.” 
 8 యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు.  9 అప్పుడు యెహోషువ నిబంధన మందసాన్ని మోసే యాజకుల కాళ్లు యొర్దాను మధ్య నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలబెట్టించాడు. నేటి వరకూ అవి అక్కడ ఉన్నాయి. 
 10 ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతా, అంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకూ యాజకులు మందసాన్ని మోస్తూ యొర్దాను మధ్య నిలబడగా ప్రజలు త్వరపడి దాటారు.  11 ప్రజలందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసం మోసే యాజకులు దాటారు. 
 12 ఇశ్రాయేలీయులు చూస్తుండగా రూబేనీయులూ గాదీయులూ మనష్షే అర్థగోత్రపు వారూ మోషే వారితో చెప్పినట్టు యుద్ధసన్నద్ధులై దాటారు.  13 సేనలో ఇంచుమించు నలభై వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధం చేయడానికి యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు వచ్చారు.  14 ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. 
 15 యెహోవా “సాక్ష్యపు మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు”  16 అని యెహోషువతో చెప్పినప్పుడు  17 యెహోషువ “యొర్దానులో నుండి ఎక్కి రండి” అని యాజకులకు ఆజ్ఞాపించాడు.  18 యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేల మీద నిలబడగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటిలాగే తమ చోటికి మళ్ళి దాని గట్లన్నిటి మీదా పొర్లి ప్రవహించాయి. 
 19 మొదటి నెల పదో తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే  20 యొర్దానులో నుండి వారు తెచ్చిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి  21 ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు “రాబోయే కాలంలో మీ సంతానం ‘ఈ రాళ్ళు ఎందుకు’ అని వారి తండ్రులను అడిగితే,  22 అప్పుడు మీరు, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. 
 23 యెహోవా బాహువు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోడానికీ  24 మీరు ఎప్పుడూ మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడానికీ, మేము దాటేవరకూ మీ దేవుడు యెహోవా తానే మన ముందు ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండి పోయేలా చేశాడో అలాగే మీరు దాటే వరకూ యొర్దాను నీళ్ళను కూడా ఎండి పోయేలా చేశాడని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి.”