యెషయా  
 1
 1 ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు. 
తన ప్రజల విరుద్ధంగా దేవుని వాదం 
 2 ఆకాశమా, భూమీ యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు. 
“నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను. 
కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు. 
 3 ఎద్దుకు తన కామందు తెలుసు. 
గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు. 
కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు. 
నా ప్రజలు గ్రహించరు.” 
 4 ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడు) అ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు. 
 5 దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి?నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి.  6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ద తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు. 
 7 “మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.” 
 8 ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారర లా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది.  9 ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు. 
 10 సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి.  11 దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి.  12 మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు? 
 13 “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్ద. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం.  14 మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు. 
 15 “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము. 
 16 “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి.  17 మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.” 
 18 యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును. 
 19 “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు.  20 కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.” 
యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు. 
యెరూషలేము దేవునికి నమ్మకంగా లేదు 
 21 దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును చూడండి. అది నన్ను నమ్మి వెంబడించిన పట్టణం. అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు. 
 22 “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది.  23 మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చు కొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.” 
 24 ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు.  25 వెండిని శుద్ధిచేయటానికి మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పులన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన వాటన్నింటినీ నేను తీసివేస్తాను.  26 ఆరంభంలో మీకు ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు ‘మంచి, నమ్మకమైన పట్టణం’ ” అని పిలువబడతారు. 
 27 దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు.  28 అయితే నేరుస్థులు, పాపులు అందురూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.) 
 29 మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకివృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు సిగ్గుపడతారు.  30 మీరు ఎండిపోతున్న ఆకుల మస్తకి వృక్షాల్లా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక ఎండిపోతున్న తోటలా మీరుంటారు.  31 శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.