౧౧
క్రైస్తవ క్రమం, ప్రభువు బల్ల 
 ౧ నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.  ౨ మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను. 
 ౩ మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.  ౪ తన తల కప్పుకొని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే.  ౫ తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం.  ౬ తన తల కప్పుకోని స్త్రీ తన తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం, లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.  ౭ పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ.  ౮ అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.  ౯ స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు.  ౧౦ కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి. 
 ౧౧ అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.  ౧౨ ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి. 
 ౧౩ మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా?  ౧౪ పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా?  ౧౫ దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!  ౧౬ ఈ విషయంలో వేరే వాదనలు చేసేవాడు, మాలో గానీ, దేవుని సంఘంలో గానీ దీనికి వ్యతిరేకంగా వేరొకఅభిప్రాయం లేదని తెలుసుకోవాలి. 
ప్రభువు బల్ల దగ్గర అక్రమాలు ఖండన 
 ౧౭ మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు.  ౧౮ మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో ముఠా తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది.  ౧౯ మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే. 
 ౨౦ మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు.  ౨౧ ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు.  ౨౨ ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని అవమానపరుస్తారా? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను. 
ప్రభువు బల్ల క్రమం, పరమార్థం 
 ౨౩ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు.  ౨౪ స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు.  ౨౫ భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకొని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు.  ౨౬ మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. 
 ౨౭ కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు.  ౨౮ కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.  ౨౯ ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు.  ౩౦ ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా.  ౩౧ అయితే మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.  ౩౨ మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు. 
 ౩౩ కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి.  ౩౪ మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.