౪
 ౧ సమరయ పర్వతం మీద ఉన్న 
బాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూ 
దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, 
మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” 
అనే మీరు, ఈ మాట వినండి. 
 ౨ యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే, 
“మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది. 
మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు. 
 ౩ మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు. 
మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.” 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౪ బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. 
గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి. 
ప్రతి ఉదయం బలులు తీసుకు రండి. 
మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి. 
 ౫ రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి. 
స్వేచ్ఛార్పణలు ప్రకటించండి. 
వాటి గురించి చాటించండి. 
ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౬ మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. 
మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. 
అయినా మీరు నా వైపు తిరుగలేదు. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౭ కోతకాలానికి మూడు నెలలు ముందే 
వానలేకుండా చేశాను. 
ఒక పట్టణం మీద వాన కురిపించి 
మరొక పట్టణం మీద కురిపించలేదు. 
ఒక చోట వాన పడింది, 
వాన పడని పొలం ఎండిపోయింది. 
 ౮ రెండు మూడు ఊర్లు 
మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే 
అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు. 
అయినా మీరు నా వైపు తిరగలేదు. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౯ విస్తారమైన మీ తోటలన్నిటినీ 
తెగుళ్ళతో నేను పాడు చేశాను. 
మీ ద్రాక్షతోటలనూ 
అంజూరపు చెట్లనీ 
ఒలీవచెట్లనూ 
మిడతలు తినేశాయి. 
అయినా మీరు నావైపు తిరగలేదు. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౧౦ నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు 
మీ మీదికి తెగుళ్లు పంపాను. 
మీ యువకులను కత్తితో చంపేశాను. 
మీ గుర్రాలను తీసుకుపోయారు. 
మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన 
మీ ముక్కుల్లోకి ఎక్కింది. 
అయినా మీరు నా వైపు తిరగలేదు. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౧౧ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు 
నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. 
మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. 
అయినా మీరు నా వైపు తిరగలేదు. 
యెహోవా ప్రకటించేది ఇదే. 
 ౧౨ కాబట్టి ఇశ్రాయేలీయులారా, 
మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను. 
కాబట్టి ఇశ్రాయేలీయులారా, 
మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి. 
 ౧౩ పర్వతాలను రూపించే వాడూ 
గాలిని పుట్టించేవాడూ ఆయనే. 
ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 
ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 
భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 
ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.