౩౪
 ౧ రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. 
భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి. 
 ౨ యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. 
ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. 
 ౩ వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. 
వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది. 
 ౪ ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. 
ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి. 
 ౫ నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది. 
 ౬ యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తంచేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. 
ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు. 
 ౭ వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. 
ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది. 
 ౮ అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం. 
 ౯ ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. 
దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది. 
 ౧౦ అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. 
అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు. 
 ౧౧ గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. 
గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. 
ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు. 
 ౧౨ రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు. 
దాన్ని పరిపాలించే వాళ్ళంతా గతించిపోయారు. 
 ౧౩ ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి. 
అది అడవికుక్కలకు, నిప్పుకోళ్లకు నివాసంగా ఉంటుంది. 
 ౧౪ క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. 
అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి. 
 ౧౫ గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. 
అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి. 
 ౧౬ యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. 
ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. 
ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు. 
 ౧౭ అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు. 
అవి శాశ్వతంగా దాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. యుగయుగాలు దానిలో నివసిస్తాయి.