౨౭
 ౧ యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. 
 ౨ నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు. 
 ౩ నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు, 
 ౪ నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు. 
 ౫ మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను. 
 ౬ నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. 
 ౭ నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక. నన్నెదిరించేవారు నీతి లేని వారుగా కనబడతారు గాక. 
 ౮ దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? 
 ౯ వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా? 
 ౧౦ వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా? 
 ౧౧ దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను. 
 ౧౨ మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు? 
 ౧౩ దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే. 
 ౧౪ వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు. 
 ౧౫ వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు. 
 ౧౬ ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా, 
 ౧౭ వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు. 
 ౧౮ వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు. 
 ౧౯ అతడు ధనికుడుగా పడుకుంటాడు గానీ అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది. 
 ౨౦ భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది. 
 ౨౧ తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది. 
 ౨౨ ఆగకుండా అది అతని మీద విసిరి కొడుతుంది. వాడు దాని చేతిలోనుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు. 
 ౨౩ అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది.