౩
 ౧ నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి. 
 ౨ ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. 
 ౩ నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు. 
 ౪ ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు. 
 ౫ నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు. 
 ౬ ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు. 
 ౭ ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. 
నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు. 
 ౮ నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. 
 ౯ ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. 
నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.  ౧౦ నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. 
దాగి ఉన్న సింహంలా ఉన్నాడు. 
 ౧౧ నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు. 
 ౧౨ విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. 
 ౧౩ తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు. 
 ౧౪ నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. 
ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు. 
 ౧౫ చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. 
విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు. 
 ౧౬ రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు. 
 ౧౭ నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు. 
 ౧౮ కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను. 
 ౧౯ నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను. 
 ౨౦ కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. 
 ౨౧ కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది. 
 ౨౨ యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. 
 ౨౩ ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. 
నీ నమ్మకత్వం ఎంతో గొప్పది! 
 ౨౪  “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. 
కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను. 
 ౨౫ తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు. 
 ౨౬ యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది. 
 ౨౭ తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. 
 ౨౮ అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి. 
 ౨౯ ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి. 
 ౩౦ అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. 
అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి. 
 ౩౧ ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు. 
 ౩౨ ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు. 
 ౩౩ హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. 
 ౩౪ దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం, 
 ౩౫ మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం, 
 ౩౬ ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా? 
 ౩౭ ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు? 
 ౩౮ మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? 
 ౩౯ బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు? 
 ౪౦ మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. 
 ౪౧ ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం- 
 ౪౨ మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు. 
 ౪౩ నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు. 
 ౪౪ మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు. 
 ౪౫ జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు. 
 ౪౬ మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు. 
 ౪౭ గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి. 
 ౪౮ నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది. 
 ౪౯ యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ, 
 ౫౦ నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది. 
 ౫౧ నా పట్టణపుఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది. 
 ౫౨ ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు. 
 ౫౩ వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు. 
 ౫౪ నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. 
 ౫౫ యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను. 
 ౫౬ సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు. 
 ౫౭ నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు. 
 ౫౮ ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు. 
 ౫౯ యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. 
 ౬౦ నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు. 
 ౬౧ యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు. 
 ౬౨ నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు. 
 ౬౩ యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి. 
 ౬౪ యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. 
 ౬౫ వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు. 
 ౬౬ యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.