Micah 
మీకా  
 ౧
 ౧ యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం. 
 ౨ ప్రజలారా, మీరంతా వినండి. 
భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి. 
యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. 
పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. 
 ౩ చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. 
ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు. 
 ౪ ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. 
నిప్పుకు కరిగిపోయే మైనంలా, 
వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి. 
 ౫ ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. 
ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. 
యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? 
అది సమరయ కాదా? 
యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? 
అది యెరూషలేము కాదా? 
 ౬ నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను. 
ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను. 
దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, 
దాని పునాదులు కనబడేలా చేస్తాను. 
 ౭ దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి. 
దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. 
దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. 
అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, 
కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి. 
 ౮ ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. 
చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. 
నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను. 
 ౯ దాని గాయాలు మానవు. 
అవి యూదాకు తగిలాయి. 
నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి. 
 ౧౦ ఈ సంగతి గాతులో చెప్పవద్దు. 
అక్కడ ఏమాత్రం ఏడవద్దు. 
బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను. 
 ౧౧ షాఫీరు పురవాసులారా, 
నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. 
జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. 
బేత్ ఎజేల్ దుఖిస్తోంది. 
వారి భద్రత తొలిగి పోయింది. 
 ౧౨ మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. 
యెహోవా విపత్తు కలిగించాడు. 
అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది. 
 ౧౩ లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. 
ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. 
నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం. 
 ౧౪ మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు. 
అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది. 
 ౧౫ మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను. 
ఇశ్రాయేలీయుల నాయకులు అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు. 
 ౧౬ నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. 
నీ వెంట్రుకలు కత్తిరించుకో. 
రాబందులాగా బోడిగా ఉండు. 
నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.