౩౦
 ౧ ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. 
అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట. 
 ౨ నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు. 
 ౩ నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానం పొందలేదు. 
 ౪ ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? 
తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? 
బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? 
భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? 
ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా? 
 ౫ దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు. 
 ౬ ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు. 
 ౭ దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. 
 ౮ వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు. 
 ౯ ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో. 
 ౧౦ దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు. 
 ౧౧ తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. 
 ౧౨ తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది. 
 ౧౩ కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా! 
 ౧౪ దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది. 
 ౧౫ జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి. 
 ౧౬ పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. 
 ౧౭ తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. 
 ౧౮ నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. 
 ౧౯ అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ. 
 ౨౦ వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది. 
 ౨౧ భూమిని వణకించేవి మూడు ఉన్నాయి, అది మోయ లేనివి నాలుగు ఉన్నాయి. 
 ౨౨ అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు, 
 ౨౩ పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కు దారైన దాసి. 
 ౨౪ భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి. 
 ౨౫ చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. 
 ౨౬ చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి. 
 ౨౭ మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి. 
 ౨౮ నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది. 
 ౨౯ డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి. 
 ౩౦ అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, 
 ౩౧ బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు. 
 ౩౨ నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో. 
 ౩౩ పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.