౨
పెంతెకొస్తు 
 ౧ పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు.  ౨ అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది.  ౩ అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి.  ౪ అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.  ౫ ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.  ౬ ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు.  ౭ వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.  ౮ మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి?  ౯ పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ  ౧౦ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన  ౧౧ యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.  ౧౨ అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకొన్నారు.  ౧౩ కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు. 
పేతురు ఉపన్యాసం- యేసే ప్రభువు, క్రీస్తు 
 ౧౪ అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. 
(1) యోవేలు ప్రవచనం నెరవేర్పు 
 ౧౫  “మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు.  ౧౬ యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే, 
 ౧౭ ‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. 
మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. 
మీ యువకులు దర్శనాలు చూస్తారు. 
మీ వృద్ధులు కలలు కంటారు, 
 ౧౮ ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. 
 ౧౯ పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను. 
 ౨౦ ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు. 
 ౨౧ ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు. 
(2) యేసు క్రియలు ఆయనను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి 
 ౨౨  “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.  ౨౩ దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.  ౨౪ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. 
(3) క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక ఆయన రాజరికం గురించి దావీదు ప్రవచనం 
 ౨౫  “ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, 
‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, 
ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. 
 ౨౬ నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. 
నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. 
 ౨౭ ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, 
నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. 
 ౨౮ నాకు జీవమార్గాలు తెలిపావు. 
నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’ 
 ౨౯  “సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.  ౩౦ అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి 
‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.  ౩౧ క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. 
(4) యేసు పునరుత్థానం ఆయనను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది 
 ౩౨  “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.  ౩౩ కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు.  ౩౪ దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు, 
 ౩౫ ‘నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకూ 
నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.’ 
 ౩౬  “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.” 
(5) ఇశ్రాయేలు ప్రజ ప్రస్తుత కర్తవ్యం 
 ౩౭ వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.  ౩౮ దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.  ౩౯ ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.  ౪౦ ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు.  ౪౧ అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.  ౪౨ వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు. 
ఆది క్రైస్తవ సంఘం 
 ౪౩ అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు.  ౪౪ నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు.  ౪౫ అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.  ౪౬ ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,  ౪౭ ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.