౬౬
 ౧ యెహోవా ఇలా చెబుతున్నాడు, 
“ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది? 
 ౨ వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. 
“ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది. 
 ౩ ఎద్దును వధించేవాడు మనిషిని కూడా చంపుతున్నాడు. గొర్రెపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడ కూడా విరుస్తున్నాడు. 
నైవేద్యం చేసేవాడు పందిరక్తం అర్పించేవాడి వంటివాడే. ధూపం వేసేవాడు విగ్రహాలను గొప్పగా చెప్పుకునే వాడివంటి వాడే. 
వాళ్ళు తమ సొంత విధానాలను ఏర్పరచుకున్నారు. తమ అసహ్యమైన పనుల్లో ఆనందిస్తున్నారు. 
 ౪ అలాగే, వారికి రావలసిన శిక్షను నేనే ఏర్పరుస్తాను. వాళ్ళు భయపడే వాటినే వారి మీదికి రప్పిస్తాను. 
ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరూ వినలేదు. 
నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.” 
 ౫ యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. 
“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, 
‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ 
అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు. 
 ౬ పట్టణంలోనుంచి యుద్ధధ్వని వస్తూ ఉంది. దేవాలయం నుంచి శబ్దం వస్తూ ఉంది. 
తన శత్రువులకు ప్రతీకారం చేసే యెహోవా శబ్దం వినబడుతూ ఉంది. 
 ౭ ప్రసవవేదన పడకముందే ఆమె పిల్లను కనింది. 
నొప్పులు రాకముందే కొడుకును కనింది. 
 ౮ అలాంటి సంగతి ఎవరైనా విన్నారా? అలాంటివి ఎవరైనా చూశారా? 
ఒక్క రోజులో దేశం పుడుతుందా? ఒక్క క్షణంలో ఒక రాజ్యాన్ని స్థాపించగలమా? 
అయినా సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె బిడ్డలను కనింది.  ౯ నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. 
“పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు. 
 ౧౦ యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. 
ఆమెనుబట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి. 
 ౧౧ ఆదరణకరమైన ఆమె చనుపాలు మీరు కుడిచి తృప్తి పడతారు. ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు. 
 ౧౨ యెహోవా ఇలా చెబుతున్నాడు, 
“నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను. 
రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డుమీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను. 
మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు. 
 ౧౩ తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.” 
 ౧౪ మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి. 
యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు. 
 ౧౫ వినండి. మహా కోపంతో ప్రతీకారం చేయడానికి అగ్నిజ్వాలలతో గద్దించడానికి 
యెహోవా మంటలతో వస్తున్నాడు. ఆయన రథాలు తుఫానులాగా వస్తున్నాయి. 
 ౧౬ అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవాచేతుల్లో అనేకమంది చస్తారు. 
 ౧౭ తోటల్లోకి వెళ్లడానికి వాళ్ళు తమను ప్రతిష్టించుకుని, పవిత్రపరచుకుంటారు. 
పందిమాంసాన్నీ అసహ్యమైన పందికొక్కులను తినే వారిని అనుసరిస్తారు. 
“వాళ్ళు తప్పకుండా నాశనం అవుతారు.” ఇదే యెహోవా వాక్కు. 
 ౧౮ వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు.  ౧౯ నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు. 
 ౨౦ అన్ని రాజ్యాల్లో నుంచి మీ సోదరులందరినీ యెహోవాకు అర్పణగా వాళ్ళు తీసుకు వస్తారు. వారిని గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద కంచర గాడిదల మీద ఒంటెల మీద ఎక్కించి యెరూషలేములోని నా పవిత్ర పర్వతానికి వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యాన్ని యెహోవా మందిరంలోకి తెస్తారు. 
 ౨౧  “యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెబుతున్నాడు. 
 ౨౨ యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను సృజించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి 
నా ముందు ఎప్పటికీ ఉన్నట్టు మీ సంతానం, మీ పేరు నిలిచి ఉంటాయి. 
 ౨౩ ప్రతి నెలా ప్రతి విశ్రాంతిరోజున నా ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రజలంతా వస్తారు” అని యెహోవా చెబుతున్నాడు 
 ౨౪ వాళ్ళు బయటికి వెళ్లి నామీద తిరుగుబాటు చేసినవారి శవాలను చూస్తారు. 
వాళ్ళను తినే పురుగులు చావవు. వాళ్ళను కాల్చే మంట ఆరిపోదు. వాళ్ళు మనుషులందరికీ అసహ్యంగా ఉంటారు.