౧౨
 ౧ యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. 
అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. 
దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు? 
 ౨ వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు. 
వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే. 
 ౩ యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. 
వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు. 
 ౪ దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. 
వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు. 
 ౫ యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? 
నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు? 
 ౬ నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు. 
వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు. 
 ౭ నేను నా మందిరం విడిచిపెట్టాను. నా వారసత్వాన్ని వదిలేశాను. 
నా ప్రియమైన ప్రజలను వారి శత్రువుల చేతికి అప్పగించాను. 
 ౮ నా వారసత్వం నాకు అడవిలోని సింహంలాగా అయ్యింది. అది నా మీద గర్జిస్తూ ఉంది. కాబట్టి అది నాకు అసహ్యం అయ్యింది. 
 ౯ నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి. 
రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి. 
 ౧౦ అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు. 
నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు. 
 ౧౧ వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు. 
 ౧౨ వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు. 
దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు. 
 ౧౩ ప్రజలు గోదుమలు చల్లారు కానీ ముండ్ల పంట కోస్తారు. పనిలో అలసిపోతున్నారు గాని ప్రయోజనం లేదు. 
యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు. 
 ౧౪ యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను.  ౧౫ ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.” 
 ౧౬ వారు “బయలు తోడు” అని ప్రమాణం చేయడం నా ప్రజలకు నేర్పారు. ఇప్పుడు వారు “యెహోవా జీవం తోడు” అని నా పేరున ప్రమాణం చేయడానికి నా ప్రజల విధానాలను జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య అభివృద్ధి చెందుతారు.  ౧౭ అయితే వారు నా మాట వినకపోతే నేను ఆ జనాలను వేరుతో సహా పెళ్ళగించి వారిని సంపూర్ణంగా నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.