11
జోఫరు 
 1 అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు, 
 2 ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా? 
 3 నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా? 
 4 నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా. 
 5 నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది. 
 6 ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో. 
 7 దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా? 
 8 నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది. 
 9 దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం. 
 10 ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు? 
 11 పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు. 
 12 అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు. 
 13 నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు. 
 14 నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు. 
 15 అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు. 
 16 తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు. 
 17 అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది. 
 18 నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు. 
 19 ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు. 
 20 దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.