33
 1 “అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను. 
నేను చెప్పే మాటలు గమనించు. 
 2 త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను. 
 3 నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను. 
నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను. 
 4 దేవుని ఆత్మ నన్ను చేసింది. 
నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది. 
 5 యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు. 
నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో. 
 6 దేవుని ఎదుట నీవు, నేను సమానం. 
మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు. 
 7 యోబూ, నన్ను గూర్చి భయపడకు. 
నేను నీ యెడల కఠినంగా ఉండను. 
 8 “కాని యోబూ, నీవు చెబుతూండగా 
నేను విన్నది ఇదే. 
 9 నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని, 
నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను. 
 10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు. 
యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు. 
 11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు. 
నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.’ 
 12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీ తో చెప్పాలి. 
ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక. 
 13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు? 
దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు? 
 14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు. 
దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు. 
 15-16 ఒక వేళ మనుష్యులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి చెవులలో చెబుతాడేమో. 
అప్పుడు వారు దేవుని హెచ్చరికలు విని చాలా భయపడతారు. 
 17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని, 
గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు. 
 18 మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు. 
ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు. 
 19 “లేక ఒక వ్యక్తి పడగ మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తుప్పుడు దేవుని స్వరం వినవచ్చును. 
ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టిన ట్లు అతడు బాధ పడుతున్నాడు. 
 20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు. 
శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు. 
 21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పోడుచుకొని వచ్చేంతగా 
అతని శరీరం పాడైపోతుంది. 
 22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. 
అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది. 
 23 కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో. 
నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు. 
 24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగాఉంటాడు, 
‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి. 
అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’ 
 25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది. 
ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు. 
 26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు. 
అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు. 
ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక. 
 27 అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను. 
మంచిని నేను చెడుగా మార్చాను. 
కానీ దేవుడు శిక్షించాల్సి నంత కఠినంగా నన్ను శిక్షించలేదు. 
 28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలాకాలం జీవిస్తాను. 
నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’ 
 29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు. 
 30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు. 
అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు. 
 31 “యోబూ, నా మాట గమనించు. నా మాటవిను. 
మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి. 
 32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను వినని. 
ఎందుకంటే, నీవు నిర్దోషిని అని రుజువు చేయగోరుతున్నాను గనుక. 
నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు. 
 33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను. 
మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.”