36
 1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. 
 2 “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు. 
దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను. 
 3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను. 
దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను. 
 4 యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం. 
నేను చెప్తున్నదేమిటో తెలిసే చెప్తున్నాను. 
 5 “దేవుడు శక్తివంతమైనవాడు, 
కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు. 
దేవుడు మహత్తర శక్తిమంతుడు, 
ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి. 
 6 దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు. 
పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు. 
 7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. 
మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు. 
మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు. 
 8 కానీ మనుష్యులు శిక్షించబడుతూ 
సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే, 
 9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు. 
వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు. 
 10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు. 
వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు. 
 11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే, 
దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు. 
 12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు. 
ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు. 
 13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు. 
దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుని ప్రార్థించ నిరాకరిస్తారు. 
 14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు. 
మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు. 
 15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. 
మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు. 
 16 “యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి, 
నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. 
దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు. 
 17 కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి. 
 18 యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక. 
విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు. 
 19 నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయలేదని నీకు తెలుసు. 
శక్తిమంతుల సహాయం కోసం మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు. 
 20 ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. 
(వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.) 
 21 యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు. 
ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు. 
 22 “దేవునికి చాలా శక్తి ఉంది. 
దేవుడే అందరిలోకెల్ల గొప్ప ఉపదేశకుడు. 
 23 ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు. 
‘దేవా నీవు తప్పు చేశావు’ అని ఎవరూ దేవునికి చెప్పలేరు. 
 24 దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు. 
మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు. 
 25 ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. 
మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు. 
 26 దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం. 
దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు. 
 27 “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని 
దాన్ని వర్షంగా మారుస్తాడు. 
 28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. 
మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది. 
 29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు. 
దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు. 
 30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా 
దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు. 
 31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు 
దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు. 
 32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు. 
దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు. 
 33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. 
తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.