౨౫
 ౧ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.  ౨  “నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.  ౩ మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.  ౪ నీలం, ఊదా రక్తవర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.  ౫ ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.  ౬ మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,  ౭ ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు. 
 ౮ నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.  ౯ నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి. 
 ౧౦ వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర  ౧౧ దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.  ౧౨ దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి. 
 ౧౩ తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి  ౧౪ వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.  ౧౫ ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.  ౧౬ ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి. 
 ౧౭ నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.  ౧౮ సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.  ౧౯ ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.  ౨౦ ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.  ౨౧ నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.  ౨౨ అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను. 
 ౨౩ నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.  ౨౪ మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.  ౨౫ దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.  ౨౬ దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.  ౨౭ బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.  ౨౮ ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు. 
 ౨౯ నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.  ౩౦ నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. 
 ౩౧ నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.  ౩౨ దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.  ౩౩ ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.  ౩౪ దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.  ౩౫ దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.  ౩౬ వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.  ౩౭ నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.  ౩౮ దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.  ౩౯ ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.  ౪౦ కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.”