౫
దేవుని ప్రియ సంతానంగా విశ్వాసి ప్రవర్తన 
 ౧ కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.  ౨ క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి. 
 ౩ మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.  ౪ కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.  ౫ మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.  ౬ పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.  ౭ కాబట్టి వారికి దూరంగా ఉండండి.  ౮ గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.  ౯ ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.  ౧౦ కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,  ౧౧ పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.  ౧౨ ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.  ౧౩ ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?  ౧౪ బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, 
నిద్రిస్తున్న నువ్వు మేలుకో. 
చనిపోయిన వారిలో నుండి లే. 
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. 
 ౧౫ బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.  ౧౬ సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.  ౧౭ అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.  ౧౮ మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.  ౧౯ కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.  ౨౦ ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. 
ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల వైవాహిక జీవనం 
 ౨౧ క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.  ౨౨ స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.  ౨౩ క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.  ౨౪ సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి. 
 ౨౫ పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.  ౨౬ సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,  ౨౭ దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు. 
 ౨౮ అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.  ౨౯ ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.  ౩౦ మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. 
 ౩౧  “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”  ౩౨ ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.  ౩౩ చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.