౯౨
విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన. 
 ౧ యెహోవాకు కృతఙ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది. 
 ౨ ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది. 
 ౩ పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది. 
 ౪ ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను. 
 ౫ యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. 
 ౬ పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు. 
 ౭ దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా! 
 ౮ అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు. 
 ౯ యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు. 
 ౧౦ అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు. 
 ౧౧ నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి. 
 ౧౨ నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు. 
 ౧౩ వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు. 
 ౧౪ యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు. 
 ౧౫ ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.