౩
 ౧ ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు, 
 ౨ ఇతర ప్రజలందరినీ సమకూర్చి, 
యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. 
నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి 
నేను అక్కడ వారిని శిక్షిస్తాను. 
వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి 
నా దేశాన్ని పంచుకున్నారు. 
 ౩ వారు నా ప్రజలకు చీట్లువేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. 
తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు. 
 ౪ తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, 
నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? 
మీరు నా మీద ప్రతీకారం చూపించినా 
మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను. 
 ౫ మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. 
నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు. 
 ౬ యూదావారూ యెరూషలేము నగరవాసులూ 
తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని 
మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు. 
 ౭ మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. 
మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను. 
 ౮ మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. 
వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. 
యెహోవా ఈ మాట చెప్పాడు. 
 ౯ రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, 
యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. 
వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి. 
 ౧౦ మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. 
మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. 
“నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి. 
 ౧౧ చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, 
మీరంతా త్వరగా సమకూడిరండి. 
యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా. 
 ౧౨ రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. 
చుట్టు పక్కలుండే రాజ్యాలకు 
తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. 
 ౧౩ పంట పండింది. కొడవలిపెట్టి కోయండి. 
రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. 
తొట్లు పొర్లి పారుతున్నాయి. 
వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది. 
 ౧౪ తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. 
తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 
 ౧౫ సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది. 
 ౧౬ యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. 
యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. 
భూమ్యాకాశాలు కంపిస్తాయి. 
అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. 
ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 
 ౧౭ మీ యెహోవా దేవుణ్ణి నేనే, 
నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. 
అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. 
వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు. 
 ౧౮ ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. 
కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. 
యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. 
యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, 
షిత్తీము లోయను తడుపుతుంది. 
 ౧౯ కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. 
ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. 
ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, 
వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. 
 ౨౦ యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. 
తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది. 
 ౨౧ వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. 
యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.