11
మాంసం తినేందుకు నియమాలు 
 1 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు:  2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: మీరు తినదగిన జంతువులు ఏవంటే:  3 ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును. 
 4-6 “కొన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. ఒంటెలు, సిరాయారకపు పొట్టికుందేలు, కుందేలు అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం.  7 మరికొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు కూడా మీకు అపవిత్రం.  8 ఆ జంతువుల (పందుల) మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు అవి మీకు అపవిత్రం. 
సముద్ర ఆహార నియమాలు 
 9 “సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తిన వచ్చును.  10-11 అయితే సముద్రంలోగాని నదిలో గాని ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, వాటని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయినది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని కూడా తాకవద్దు.  12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి. 
తినకూడని పక్షులు 
 13 “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు,  14 గద్ద, అన్నిరకాల గద్దలు,  15 అన్ని రకాల నల్ల పక్షులు,  16 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు,  17 గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు,  18 నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు,  19 గూడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు. 
 20 “రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీటకాలను తినవద్దు.  21 అయితే కీటకాలకు రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవైతే, అలాంటి కీటకాలను మీరు తినవచ్చును.  22 ఏ కీటకాలను మీరు తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, అన్నిరకాల ఆకు మిడతలు. 
 23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం.  24 ఆ కీటకాలు మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు అపవిత్రం అవుతాడు.  25 ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు. 
అపవిత్ర జంతువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు 
 26-27 “కొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయిగాని డెక్కలు సమానంగా చీలి ఉండవు. కొన్ని జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరైనా తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు  28 వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు అపవిత్రము. 
పాకే జంతువులను గూర్చిన నియమాలు 
 29 “ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగిసలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు.  30 అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, ఊసరవెల్లులు.  31 ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు. 
అపవిత్ర జంతువులను గూర్చిన నియమాలు 
 32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది.  33 “అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ఆ ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను పగులగొట్టి తీరాలి.  34 అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది.  35 అపవిత్రమైచచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యికావచ్చును, మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగులగొట్టాలి. అవి ఇంకెంత మాత్రం పరిశుద్ధంగా ఉండవు. అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి. 
 36 “నీళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని, పరిశుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు.  37 అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్లువేసే ఏ విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే ఉంటుంది.  38 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ విత్తనాలమీద పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు అపవిత్రం. 
 39 “మీరు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.  40 మరియు ఈ జంతు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. 
 41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు.  42 పొట్టతో పాకే జంతువుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి.  43 అసహ్యమైన ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.  44 ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్ధుడ్ని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ పాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.  45 మిమ్మల్ని ఈజిప్టునుండి నేను తీసుకొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్ధుడ్ని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!” 
 46 భూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద పాకే జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి.  47 పవిత్ర జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు తేలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో ప్రజలకు తెలుస్తుంది.