13
సౌలు చేసిన మొదటి తప్పు
అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలురు పాలించేసరికి ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.
యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు.
“హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు. ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు.
సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.
ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.
సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు. “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. 10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.
11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు.
అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. 12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.
13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞన పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు. 14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు. 15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు.
మిక్మషువద్ద యుద్ధం
సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు. 16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, మరియు సైనికులు బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు.
ఫిలిష్తీయులు మిక్మషులో గుడారాలు వేసుకొనియుండిరి. 17 మెరుపు దాడులు చేసే మూడు దళాలు ఫిలిష్తీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. ఒక దళం ఉత్తరంగా షూయాలు ప్రాంతంలో ఓఫ్రా మార్గంలో వెళ్లింది. 18 రెండవది వాయవ్య దిశగా బేత్ హోరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా ఉంది.
19 ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ లేడు. “(కమ్మరివాళ్లు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తులను ఈటెలను చేయించుకొనెదరు” అని ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి. 20 ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును పెట్టగలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయాల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. 21 నాగళ్లు, పారలు సాన బెట్టడానికి ఫిలిష్తీ కమ్మరులు 1/3 వంతు ఔన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన బెట్టటానికి వారు 1/6 వంతు ఔన్సు (వెండి) (అక్షరాలషెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు. 22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.
23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.