24
యోవాషు ఆలయాన్ని పునరుద్దరించుట
యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు. యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు. యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు.
కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరిం చాలని యోవాషు నిర్ణయించాడు. యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు.
ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు.
గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.
రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు. పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం. 10 పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు. 11 తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు. 12 తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు.
13 పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు. 14 పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు.
15 యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు. 16 దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజల తనిని అక్కడ సమాధి చేశారు.
17 యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు. 18 రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు. 19 వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించాను. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.
20 దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెప్తున్నాడు. ‘ప్రజాలారా, యెహోవా ఆజ్ఞాలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలి వేస్తున్నాడు!’ ”
21 కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు. 22 రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.
23 సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. యోవాషు దుర్మార్గత 24 అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు. 25 అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు.
26 జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ. 27 యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.