4
ఒక ప్రవక్తయొక్క భార్య విధవరాలై, సహాయం కోసం ఎలీషాని అడగటం
ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దురు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.
“నేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో ఏమున్నదో చెప్పుము” అని ఎలీషా అడిగినాడు.
ఆమె, “మా ఇంట్లో ఏమీ లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ వున్నది” అని బదులు చెప్పింది.
అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో. తర్వాత మీ ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమారులు మాత్రం ఇంటిలో వుర డాలి. అటు తర్వాత నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక చోట ఉంచుము” అని చెప్పాడు.
అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడుకులు మాత్రమే ఇంట్లోవున్నారు. ఆమె కుమారులు పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది. ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది.
కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.
ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”
షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట
ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు.
ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు. 10 ఎలీషా కోసం మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది.
11 ఒక రోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు. 12 ఎలీషా తన సేవకుడైన గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.
సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా ఎదుట నిలిచింది. 13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?”
ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది.
14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు.
“ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.
15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు.
అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది. 16 ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు.
ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది
షూనేము స్త్రీకి కొడుకు పుట్టుట
17 ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్లుగా, తరువాత వసంత ఋతువులో ఆమె ఒక కుమారుని ప్రసవించింది.
18 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పొలం లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు 19 తండ్రి చూచి, “అయ్యో, నా తల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు.
“అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని తండ్రి తన సేవకునికి చెప్పెను.
20 సేవకుడు ఆపిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద కూర్చొని వున్నాడు. తర్వాత ఆపిల్లవాడు మరణించాడు.
ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం
21 దైవజనుడైన (ఎలీషా) పడకమీద ఆమె తన పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి వెలుపలికి వెళ్లంది. 22 ఆమె తన భర్తను పిలిచి, “ఒక సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను దైవజనుని (ఎలీషా) కలుసుకునేందుకు తర్వగా వెళ్లెదను” అని చెప్పింది.
23 ఆమె భర్త, “దైవజనుని (ఎలీషా) వద్దకు నేడెందుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు.
“ఫరవాలేదు అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది.
24 తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ సేవకునితో, మనము తర్వగా వెళదాము, వేగముగా తోలుము, నేను చెప్పేంత వరుకూ నెమ్మదిగా తోలవద్దని చెప్పింది.
25 ఆ స్త్రీ దైవజనుడను (ఎలీషా) చూసేందుకు కర్మెలు పర్వతానికి వెళ్లింది.
దైవజనుడు (ఎలీషా) షూనేము స్త్రీ చాలాదూరంనుండి వస్తుండగా చూశాడు.ఎలీషా తన సేవకుడైన గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ, 26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’ ” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు.
ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.
27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి క్రిర దికి వంగి ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు.
28 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు కావలయనని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం చెయవద్దు” అన్నాను, అని అనగా
29 వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్లడానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్ద. ఎవరినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము అనికూడా చెప్పకుము. ఒకవేళ ఎవరైన నీకు, ‘నమస్కారము’ అన్నట్లుయితే, అతనికి బదులు చెప్పకుము. నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము” అని చెప్పాడు.
30 కాని ఆబిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవం తోడు నీవు రాకుండా నేను వెళ్లను” అంది.
అందువల్ల ఎలీషా లేచి, షూనేము స్త్రీని అనుసరించాడు.
31 ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆబిడ్డ ముఖము మీద ఆకర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవడు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.
షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట
32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.
35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.
36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.
గేహజీ షూనేము స్త్రీని పిలచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.
37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.
ఎలీషా మరియు విషం కలిపిన కూర
38 ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారుచేయి” అని చెప్పాడు.
39 ఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం వెళ్లాడు. అతను పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు తీసుకు వచ్చాడు. ఆకాయలు తన ఒడిలో కట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. కాని అది ఏరకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు.
40 తర్వాత వారు మనష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి ప్రారంభించాగా, ఎలీషాని పిలిచి, “దైవజనుడా! కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు.
41 అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనష్యులకు ఆ కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు.
ఆకూరలో ఎలాంటి దోషం లేదు.
ప్రవక్తల బృందానికి ఎలీషా ఆహారమిచ్చుట
42 బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదట పంటవల్ల లభించిన (ఎలీషా) ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఏలీషా అప్పుడు, “వీటని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.
43 ఎలీషా సేవకుడు, “ఏమిటి? ఇక్కడ వంద మంది ఉన్నారు. నేను వారందరికీ ఈ ఆహారం ఎలా ఇవ్వగలను?” అని అన్నాడు.
కాని ఎలీషా, “వారు తినడానికిగాను అది ఇమ్ము. వారది భుజిస్తారు. ఇంకా కొంచెం ఆహారం మిగులు తుంది అని యెహోవా చెప్పాడు” అన్నాడు.
44 అప్పుడు ఎలీషా సేవకుడు ఆ ఆహారమును ప్రవక్తల ముందుంచాడు. ప్రవక్తల బృందం తినడానికి తగినంత ఆహారం ఉండి, పైగా ఇంకా ఆహారం మిగిలి పోయింది. యెహోవా చెప్పినట్లుగానే ఇది జరిగింది.