9
యెహోవా బలిపీఠం పక్కన నిల్చున్నట్లు దర్శనం
నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు:
 
“స్తంభాల తలలపై కొట్టు.
దానితో అది గుమ్మాల వరకు కదులుతుంది.
స్తంభాలు ప్రజల తలలపై పడేలా కొట్టు.
ఇంకా ఎవరైనా మిగిలితే వారిని నేను కత్తితో చంపుతాను.
ఏ వ్యక్తి అయినా పారిపోవచ్చు; కాని అతడు తప్పించుకోలేడు.
ప్రజలలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
వారు పాతళం లోపలికి పోయినా నేను వారిని
అక్కడనుండి బయటకు లాగుతాను.
వారు ఆకాశంలోకి దూసుకుపోతే,
నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.
వారు కర్మెలు పర్వతం శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను.
వారిని అక్కడ పట్టుకొని తీసుకొస్తాను.
వారు నా నుండి సముద్రం గర్భంలో దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ ఇస్తాను.
అది వారిని కాటేస్తుంది.
వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే,
నేను కత్తికి ఆజ్ఞ ఇస్తాను.
అది వారిని అక్కడ చంపివేస్తుంది.
అవును. నేను వారిపై నిఘా వేసి ఉంటాను.
వారికి కష్టాలు తెచ్చి పెట్టే ఉపాయాలను నేను అన్వేషిస్తాను.
అంతేగాని, వారికి మంచి చేసే విధానాలను నేను చూడను.”
శిక్ష దేశ ప్రజలను నాశనం చేస్తుంది
నా ప్రభువును సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
అది కరిగిపోతుంది.
అప్పుడు భూమిపై నివసించే వారంతా చనిపోయిన వారి కొరకు విలపిస్తారు.
ఈజిప్టులో నైలు నదిలా
భుమి పెల్లుబికి పడుతుంది.
యెహోవా తన పై అంతస్తు గదులు ఆకాశంపై నిర్మించాడు.
ఆయన తన స్వర్గాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు.
సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు.
పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు.
ఆయన పేరు యెహోవా.
ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా ప్రతిజ్ఞ
యెహోవా ఇది చెపుతున్నాడు:
 
“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయులు) వంటివారు.
ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశం నుండి బయటకు తీసికొని వచ్చాను.
ఫిలిష్తీయులను కూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
మరియు అరామీయులను (సిరియనులు) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”
 
నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలు) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలం నుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలి పోతుంది. యాకోబు వంశం విషయంలో కూడ ఇదేరీతి జరుగుతుంది.
 
10 “నా ప్రజలలో పాపులైనవారు,
‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”
రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట
11 “దావీదు గుడారం పడిపోయింది.
కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
మరియు నా పేరు మీద నిలబడే జనులందరూ సహాయం కొరకు యెహోవా వైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయు వాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
వారు ఆ తోటల నుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.