7
జ్ఞానము నిన్ను వ్యభిచారం నుండి కాపాడుతుంది
నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు. నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది). నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో. అప్పుడు అవి పరస్త్రీనుండి నిన్ను కాపాడు తాయి. నిన్ను పాపములోకి ఈడ్చివేయగల చక్కటి మాటలనుండి నిన్ను కాపాడతాయి.
ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను. ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటిమూలకు నడిచాడు. సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. 10 ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది. 11 పాపం గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ నిలిచి వుండదు. 12 కాని ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె అన్ని మూలలకూ వెళ్తుంది. 13 ఆమె ఆ యువకుడ్ని గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె ఇలా చప్పింది: 14 “ఈవేళ నేను సాంగత్య బలి అర్చించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది). 15 అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్యానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనబడ్డావు! 16 నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు దుప్పట్లు. 17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు పోల్చిన చెక్క నేను ఉపయోగించాను. 18 వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. 19 నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్లిపోయాడు. 20 దీర్ఘప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.”
21 ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ చేశాయి. 22 ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతడు ఉన్నాడు. 23 దాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్దంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు.
24 కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి. 25 చెడు స్త్రీని మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వెంబడించకండి. 26 ఆమె చాలా మంది పురుషులను పడ వేసింది. ఆమె చాలా మంది పురుషులను నాశనం చేసింది. 27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది!