11
యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి.
“అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు, ఆతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు స్తెన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూసారు. వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, వాళ్లను యెహోవా ఎర్ర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ నాశనం చేయటం మీరు చూసారు. మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే మీ పిల్లలు కాదు. రూబేను వంశానికి చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములకు యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పనిమనిషిని, ప్రతి జంతువును మింగి వేసింది. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిం టినీ చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు.
“కనుక ఈ వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యోర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసు కోగలుగుతారు. మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచివాటితో నిండిన దేశం.* మంచి … దేశం “పాలు తేనెలు ప్రవహించుచున్న దేశం” అని మూలభాషలో వ్రాయబడివుంది. 10 మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. 11 అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. 12 మీ దేవుడైన యోహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.
13 “ ‘మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే, అప్పుడు 14 సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. 15 మీ పశు వుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు ఆహారం తినే సమృద్ధిగా ఉంటుంది.’
16 “అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు. 17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.
18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి. 19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి. 20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.
22 “మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గాలన్నింటినీ వెంబడించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి. 23 అప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 24 మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా సముద్రంవరకు వ్యాపించి ఉంటుంది. 25 మీకు వ్యతిరేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో మీరు ఎక్కుడికి వెళ్లినాసరే ప్రజలు మీకు భయపడేటట్టుగా మీ దేవుడైన యెహోవా చేస్తాడు. ఇంతకు ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.
ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశిర్వాదములా లేక శాపములా
26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమోలేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. 27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. 28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.
29 “మీరు నివసించబోతున్న దేశానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు గెరీజీము కొండమీదికి వెళ్లి, అక్కడనుండి ఆ ఆశీర్వాదాలు చదివి ప్రజలకు వినిపించాలి. అలాగే ఏబాలు కొండమీదికి కూడా మీరు వెళ్లి అక్కడనుండి శాపాలు చదివి ప్రజలకు వినిపించాలి. 30 అరాబాలో నివసించే కనానీ ప్రజల దేశంలో యోర్దాను నదికి ఆవలి ప్రక్క ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమాన గిల్గాలు పట్టణానికి దగ్గరగా మోరేలోని సింధూర వృక్షాలకు సమీపంగా ఉన్నాయి. 31 మీరు యోర్దాను నది దాటివెళ్తారు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. ఈ దేశం మీది అవుతుంది. మీరు ఈ దేశంలో నివసించేటప్పుడు, 32 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ జాగ్రత్తగా లోబడాలి.

*11:9: మంచి … దేశం “పాలు తేనెలు ప్రవహించుచున్న దేశం” అని మూలభాషలో వ్రాయబడివుంది.