32
“ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
భూమి నానోటి మాటలు వినునుగాక!
నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
మెత్తటి గడ్డిమీద పడేజల్లులా ఉంటుంది.
కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!
 
“ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
ఆయన పని పరిపూర్ణం!
ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
నమ్ముకొదగ్గ దేవుడు.
ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా.
మీరు నిజంగా ఆయన పిల్లలు కారు.
మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు.
మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా?
మీరు బుద్ధిహీనులు, ఆజ్ఞానులు,
యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు.
ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.
 
“పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి,
అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి.
మీ తండ్రిని అడగండి, ఆతడు చెబుతాడు;
మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు.
ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు.
తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని
ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
ఆయన ప్రజలే యెహోవా వంతు;
యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.
 
10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు,
వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి,
ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు.
యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు.
పక్షిరాజు తన పిల్లలను ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది.
అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది.
అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది.
మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది.
యెహోవా అలాగే ఉన్నాడు.
12 యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు.
యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు.
13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు,
పొలంలోని పంటను యాకోబు భుజించాడు
యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి
రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు.
14 మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు
గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు,
అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు.
ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.
 
15 “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు.
వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది.
వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు.
వాడు ఆ బండను(యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
16 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు.
యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు.
17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు.
వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు.
ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.
 
19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల
ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు,
‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.
వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను.
ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు
వారు అపనమ్మకమైన పిల్లలు.
21-22 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు.
పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు.
నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను.
ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను.
నా కోపం అగ్నిని రాజబెట్టింది;
నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని,
దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది.
నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.
 
23 “ ‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను.
నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.
24 ఆకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడిచేత.
భయంకర నాశనం చేతవారు నాశనమైపోతారు.
బురదలో పాకే పాముల విషం,
మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను.
25 బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది;
లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది.
యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని,
తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.
 
26 “ ‘నేనంటాను: ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా ఊదేస్తాను.
ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచిపోయేటట్టు నేను చేస్తాను.
27 ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు
అది నాకు చికాకు కలిగిస్తుంది.
ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని,
“మా స్వంత శక్తితో మేము గెలి చాము
అది యోహోవా చేయలేదు’ ” అనవచ్చును.
 
28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
29 వారు తెలివిగల వాళ్లయితే
వారు దీనిని గ్రహిస్తారు.
భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలోచిస్తారు.
30 ఒకడు 1,000 మందిని తరిమితే
ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు?
యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే
అలా జరుగుతుంది.
ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే,
యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
31 ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ* బండ దేవునియొక్క పేరు ఇది ‘ఆయన ఒక బలమైన కోట లేక ఆశ్రయ దుర్గము’ అనే అర్థాన్నిస్తుంది. (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు.
ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
32 ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా సొదొమ … గొమొర్రా వారి పాపముద్వారా దేవునిచే నశింపబడిన రెండు పట్టణాలు. ఆదికాండము 19 వ అధ్యాయం చూడండి. పొలాలలోని దాని వంటిది.
వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
33 వారి ద్రాక్షారసం కృర సర్పాల విషం నాగు పాముల కఠిన విషం.
 
34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను
‘నా గిడ్డంగిలో తాళం వేసి దీనిని
నేను భద్రపరుస్తున్నాను అని యెహోవా చెబుతున్నాడు.
35 ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి
వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే;
ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది
వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’
 
36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు.
వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు.
వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు.
బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా
నిస్సహాయు లయ్యేటట్టు ఆయన చేస్తాడు.
37 అప్పుడు ఆయన ఇలా అంటాడు,
‘అబద్ధపు దేవుళ్లు ఎక్కడ?
భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ?
38 ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు.
వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు.
కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి.
వారినే మిమ్మల్ని కాపాడ నివ్వండి!
 
39 “ ‘ఉప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే
దేవుణ్ణి ఇంకే దేవుడూ లేడు.
ప్రజలను బ్రతకనిచ్చేది,
చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే.
నేను ప్రజల్ని బాధించగలను,
బాగు చేయగలను.
నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
40 ఆకాశం వైపు నేను నాచేయి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను.
నేను శాశ్వతంగా జీవించటం సత్యమయితే,
ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడ సత్యమే.
41 నేను ప్రమాణం చేస్తున్నాను,
తళతళలాడే నా ఖడ్గానికి నేను పదునుపెడ్తాను.
నా శత్రువుల్ని శిక్షించటానికి నేను దానిని నేను ఉపయోగిస్తాను.
నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
42 నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు.
నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి.
నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’
 
43 “దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి.
ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక.
తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక.
ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు.
ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”
మోషే తన కీర్తనను ప్రజలకు నేర్పుట
44 మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వినగలిగేటట్లు ఈ పాటలోని మాటలన్నీ చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ మోషేతో ఉన్నాడు. 45 మోషే ప్రజలకు ఈ ప్రబోధాలు చేయటం ముగించినప్పుడు 46 వాళ్లతో ఆతడు ఇలా చెప్పాడు: “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ పిల్లలు విధేయులు కాలావని మీరు వారికి చెప్పాలి. 47 ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. అవి మీకు జీవం. యోర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.”
నెబో కొండ మీద మోషే
48 ఈ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు, 49 “అబారీము పర్వతాలకు వేళ్లుము. ఎరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి ఎక్కివెళ్లు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు. 50 నీవు ఆ కొండమీద చనిపోతావు. హూరు కొండమీద నీ సోదరుడు ఆహరోను చనిపోయి, తన ప్రజలను చేరుకున్నట్టు నీవు కూడ చనిపోయిన నీ ప్రజలను చేరుకుంటావు. 51 ఎందుకంటే సీను అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు. 52 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు ఇప్పుడు నీముందర చూడ వచ్చు గాని నీవు దానిలో ప్రవేశించలేవు.”

*32:31: బండ దేవునియొక్క పేరు ఇది ‘ఆయన ఒక బలమైన కోట లేక ఆశ్రయ దుర్గము’ అనే అర్థాన్నిస్తుంది.

32:32: సొదొమ … గొమొర్రా వారి పాపముద్వారా దేవునిచే నశింపబడిన రెండు పట్టణాలు. ఆదికాండము 19 వ అధ్యాయం చూడండి.