33
నేను మీతో రాను
అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను. మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచి పెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు. “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు. కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.
తాత్కాలిక సన్నిధి గుడారం
గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడేనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చుస్తుండేవారు. మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు. 10 సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు.
11 మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.
యెహోవా మహిమను మోషే చూశాడు
12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు. 13 నిజంగా నేను నీక ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు. 16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి కూడా బ్రతకలేడు.
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”