22
యెహెజ్కేలు యెరూషలోముకు వ్యతిరేకంగా మాట్లాడటం
యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నీవు న్యాయనిర్ణయం చేస్తావా? హంతకుల నగరంపై (యెరూషలేము) నీవు తీర్పు తీర్చుతావా? ఆమె చేసిన భయంకరమైన కార్యాలను గూర్చి ఆమెకు తెలియ జేస్తావా? నీవు ఈలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, నగరం హంతకులతో నిండి ఉంది. కావున ఆమెకు శిక్షపడే కాలం వస్తుంది! తనకై తాను రోతవిగ్రహాలను చేసింది. ఆ విగ్రహాలే ఆమెను మలినపర్చాయి!
“ ‘యెరూషలేము వాసులారా, మీరనేక మందివి హతమార్చారు. మీరు అసహ్యకరమైన విగ్రహాలను చేశారు. మీరు నేరస్తులు. మిమ్మల్ని శిక్షించే కాలం వచ్చింది. మీకు అంతం సమీపించింది. అన్యదేశాలవారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ రాజ్యాల వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మీకు దగ్గరలోను, దూరంలోను వున్న ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీ పేరును మీరే పాడుచేసుకున్నారు. వారి పెద్ద నవ్వును మీరు వినవచ్చు.
“ ‘చూడండి! ఇశ్రాయేలు పాలకులలో ప్రతివాడూ ఇతరులను చంపటానికి యెరూషలేములో తనను తాను బాగా బలపర్చుకున్నాడు. యెరూషలేములో ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. ఆ నగరంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. ఆ నగరంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తున్నారు. మీరంతా నా పవిత్ర వస్తువులను అసహ్యించు కుంటారు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను మీరు సామాన్యమైనవిగా భావిస్తారు. యెరూషలేము ప్రజలు ఇతరులను గురించి అబద్ధాలు పలుకుతారు. ఆ అమాయక ప్రజలను చంపటానికే వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ప్రజలు బూటకపు దేవుళ్లను కొలవటానికి కొండల మీదికి వెళతారు. పిమ్మట యెరూషలేముకు వచ్చి స్నేహ పంక్తి భోజనాలు చేస్తారు.
“ ‘యెరూషలేములో ప్రజలు కామవాంఛలతో కూడిన పాపాలు చేస్తారు. 10 యెరూషలేములో మనుష్యులు తమ తండ్రి భార్యతోనే వ్యభిచరించి పాపం చేస్తారు. యెరూషలేములో మనుష్యులు స్త్రీలను మానభంగం చేస్తారు. స్త్రీలు బహిష్టు అయినప్పుడు కూడా వారిని చెరబట్టి మానభంగం చేస్తారు. 11 ఒకడు ఆ భయంకర పాపాన్ని తన పొరుగువాని భార్యతోనే చేస్తాడు. మరొకడు తన కోడలితోనే వ్యభిచరించి ఆమెను అపవిత్ర* అపవిత్రము పరిశుద్ధురాలు కానట్టి లేక దేవుని ఆరాధనకు పనికిరానటువంటి అని భావం. పరుస్తాడు. ఇంకొకడు తన తండ్రి కుమార్తెయగు తన సోదరిని మానభంగం చేస్తాడు. 12 ఓ యెరూషలేము ప్రజలారా, నరహత్య చేయటానికి మీరు డబ్బు తీసుకొంటారు. మీరు డబ్బు అప్పు ఇచ్చి, దానిమీద వడ్డీ తీసుకుంటారు. స్వల్ప లాభం కోసం మీరు మీ పొరుగువారిని మోసగిస్తారు. మీరు నన్ను మర్చిపోయారు.’ ” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
13 దేవుడు ఇలా చెప్పసాగాడు: “ ‘ఇప్పుడు చూడు! నా చేతిని కింద కొట్టి నిన్ను ఆపుతాను! ప్రజలను మోసగించినందుకు, చంపినందుకు నిన్ను నేను శిక్షిస్తాను. 14 అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావా? నేను నిన్ను శిక్షించటానికి వచ్చినప్పుడు నీవు శక్తిగలిగివుంటావా? లేదు! ఉండలేవు. నేనే యెహోవాను. మాట్లాడింది నేనే. నేనన్నది చేసి తీరుతాను! 15 మిమ్మల్ని చాలా దేశాలలోనికి చెదరగొడతాను. మీరు అన్యదేశాలకు పారిపోయేలా మీపై ఒత్తిడి తెస్తాను. ఈ నగరంలో ఉన్న ఏహ్యమైన వస్తువులన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. 16 కాని యెరూషలేమా, నీవు అపవిత్రమవుతావు. పైగా ఇతర దేశాలన్నీ ఈ విషయాలు జరగటం చూస్తాయి. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.’ ”
పనికిరాని చెత్తవంటి ఇశ్రాయేలు
17 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, 18 “నరపుత్రుడా, వెండితో పోల్చినప్పుడు కంచు, ఇనుము, సీసము, తగరము మొదలైనవి చాలా విలువతక్కువ లోహాలు. పనివారు వెండిని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు. కరిగిన వెండి నుంచి పనివారు అలా మైలను వేరు చేస్తారు. ఇశ్రాయేలు దేశం అలా వేరు చేయబడిన మలిన పదార్థంలా తయారయ్యింది. 19 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘మీ ప్రజలంతా పనికిరాని చెత్తలా తయారయ్యారు. అందవల్ల మిమ్మల్నందరినీ యెరూషలేముకు చేర్చుతాను. 20 పనివారు వెండిని, కంచును, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని నిప్పులో వేసి, నిప్పురగిలేలా కొలిమి వూదుతారు. లోహాలు కరగటం మొదలు పెడతాయి. అదేమాదిరి, మిమ్మల్ని నా అగ్నిలో వేసి కరగబెడతాను. నా రగిలే కోపమే ఆ నిప్పు. 21 ఆ నిప్పులో మిమ్మల్ని వేస్తాను. నా కోపాగ్నిని బాగా రగిలేలా చేస్తాను. అప్పుడు మీరు కరగటం మొదలు పెడతారు. 22 వెండి నిప్పులో కరుగుతుంది. పనివారు శుద్ధ వెండిని వేరుచేసి దానిని భద్రపరుస్తారు. అదేమాదిరి మీరు నగరంలో కరుగుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నా కోపాన్ని మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకొంటారు.’ ”
యెహెజ్కేలు యెరూషలేముకు వ్యతిరేకంగా మాట్లాడుట
23 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 24 “నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెలో చెప్పుము. నేను ఆ రాజ్యాల మీర కోపంగావున్నాను. అందువల్ల ఆ రాజ్యంలో వానలు పడవు. 25 యెరూషలేములోని ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారున్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. వారెన్నో విలువైన వస్తువులను తీసుకున్నారు. యెరూషలేములో ఎందరో స్త్రీలు విధవలు కావటానికి వారు కారకులయ్యారు.
26 “యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల చేశారు. వారు వాటిని ముఖ్యమైనవిగా పరిగణించరు. పవిత్ర వస్తువులను అతి సామాన్యమైనవిగా చూస్తారు. శుభ్రమైన వస్తువులను వారు మురికైనవిగా చూస్తారు. ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించ బడ్డాను.
27 “తాను పట్టిన జంతువును తీంటున్న తోడేలులా ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు కావాలనే కోర్కెతో ఆ నాయకులు ప్రజలను చంపివేస్తారు.
28 “ప్రవక్తలు ప్రజలను హెచ్చరించరు. వారు నిజాన్ని దాచివేస్తారు. వారు గోడ నిర్మాణం చేయకుండా, పగుళ్లపై బంకమట్టి పూసే పనివారిలావుంటారు. వారి కండ్లకు కేవలం అబద్ధాలే కన్పిస్తాయి. భవిష్యత్తును తెలుసుకొనటానికి వారు మంత్ర తంత్రాలను వినియోగిస్తారు. అయినా వారు అబద్ధాలు మాత్రమే చెపుతారు. వారు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు’ అని అంటారు. కాని వారు అబద్ధ మాడుచున్నారు. యెహోవా వారితో మాట్లాడలేదు!
29 “సామాన్య ప్రజలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు. ఒకరి నొకరు మోసపుచ్చుకుని, ఒకరి సొమ్ము నొకరు దొంగిలించుకుంటారు. వారు పేదలను, ఆసరాగా పెట్టుకొని ధనవంతులవుతారు. వారితో నివసిస్తున్న పరదేశీయులను మోసగిస్తారు. వాళ్లకు ఎప్పుడూ న్యాయంగా ఉండరు.
30 తమ జీవిత విధానాన్ని మార్చుకొని, తమ దేశాన్ని రక్షించుకోమని నేను ప్రజలకు హితవు చెప్పాను. గోడలను పటిష్ట పర్చమని నేను ప్రజలకు చెప్పాను. బీటలు వారిన గోడలవద్ద నిలబడి, తమ నగర పరిరక్షణకు పోరాడమని చెప్పాను. కాని ఏ ఒక్కడు సహాయపడటానికి ముందుకు రాలేదు! 31 కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

*22:11: అపవిత్రము పరిశుద్ధురాలు కానట్టి లేక దేవుని ఆరాధనకు పనికిరానటువంటి అని భావం.