26
తూరును గుర్చిన విషాదవార్త
దేశ భ్రష్టత్వంలో (చెర) పదకొండవ సంవత్సరపు మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడ: “నరపుత్రుడా, యెరూషలేమును గురించి తూరు చెడ్డ విషయాలు చెప్పింది, ‘ఆహా! ప్రజలను రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువైన వస్తువులు ఎన్నో లభిస్తాయి!’ ”
కావున నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తూరూ, నీకు నేను వ్యతిరేకిని! నీపై యుద్ధం చేయటానికి అనేక దేశాల వారిని తీసుకొని వస్తాను. తీరం మీదికి వచ్చిపడే సముద్రపు అలల్లా, వారు నీ మీదికి మాటి మాటికీ వస్తారు.”
దేవుడు ఇలా అంటున్నాడు: “శత్రు సైనికులు తూరూ గోడలను నాశనం చేస్తారు. దాని బురుజులను కూలగొడతారు. ఆమె రాజ్యంలో గల భూమి యొక్కపైభాగవు నేలను చెరిపివేస్తాను. తూరును ఒక బండరాయిగా మార్చివేస్తాను. సముద్ర తీరాన కేవలం చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికి వచ్చే స్థలంవలె తూరు అయిపోతుంది. ఇదే నా మాట!” నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యుద్ధంలో సైనికులు తీసుకొనే విలువైన వస్తువుల వలె తూరు అయిపోతుంది. దాని ముఖ్య భూమిలో గల ఆమె కుమారైలు ( చిన్న పట్టణాలు ) యుద్ధంలో చంపబడతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
నెబుకద్నెజరు తూరును ఎదుర్కొనబోవుట
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు మీదికి ఉత్తర దిశనుండి ఒక శత్రువును రప్పిస్తాను. బబులోను మహారాజైన నెబుకద్నెజరే ఆ శత్రువు! అతడు చాలా పెద్ద సైన్యంతో వస్తాడు. ఆ సైన్యంలో గుర్రాలు, రథాలు, రౌతులు ఇంకా అనేకమంది ఇతర సైనికులు ఉంటారు! ఆ సైనికులలో చాలా దేశాల వారుంటారు. ముఖ్య భూమిలో నీ కుమారైలను (చిన్న పట్టణాలు) నెబుకద్నెజరు చంపివేస్తాడు. నీ నగరాన్ని ఎదుర్కోవటానికి అతడు బులుజులను నిర్మిస్తాడు. నీ నగరం చుట్టూ అతడు మట్టిబాట నిర్మిస్తాడు. గోడల వరకు ఒక మట్టిదారి వేస్తాడు. నీ గోడలు పగులగొట్టటానికి అతడు దూలాలు తెస్తాడు. నీ బురుజులు కూలగొట్టటానికి అతడు వాడిగల పనిముట్లను ఉపయోగిస్తాడు. 10 లెక్కకుమించి వున్న అతని గుర్రాలు రేపే దుమ్ముతో నీవు కప్పబడతావు. బబులోను రాజు నగర ద్వారాల గుండా నగర ప్రవేశం చేసినప్పుడు గుర్రాల చప్పుడుకు, బండ్లు, రథాలు చేసే ధ్వనికి నీ గోడలు కిందికి తోయబడుతాయి. అవును, నీ గోడలు పెరికివేయటానికి వారు నీ నగరంలోకి వస్తారు. 11 బబులోను రాజు గుర్రం మీద నీ నగరం గుండా వస్తాడు. అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ పిండిగొట్టినట్లు దట్టస్తాయి. నీ ప్రజలను అతడు కత్తులతో చంపివేస్తాడు. నీ నగరంలోని బలమైన స్తంభాలు నేలకూలుతాయి. 12 నెబుకద్నెజరు మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త వలె, సముద్రంలో పారవేస్తారు. 13 అలా మీ ఆనంద గీతికల శబ్దాన్ని ఆపివేస్తాను. ప్రజలు మీ వీణావాదనలు మరి వినరు. 14 నిన్నొక బండరాయిలా మార్చివేస్తాను. సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికివచ్చే స్థలంగా మారిపోతావు! నీవు తిరిగి నిర్మింపబడవు. ఎందవల్లననగా యెహోవానైన నేను ఈ విషయం చెపుతున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
తూరు కొరకు ఇతర దేశాల విలాపం
15 నా ప్రభువైన యెహోనా ఈ విషయం తూరుకు చెపుతున్నాడు: “మధ్యధరా సముద్ర తీరానగల దేశాలు నీ పతనంవల్ల కలిగిన శబ్దానికి తుళ్లిపడతాయి. నీ ప్రజలు హింసించబడి, చంపబడినప్పుడు అది జరుగుతుంది. 16 సముద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు విసర్జిస్తారు. పిమ్మట వారు ‘భయసూచక దుస్తులు’ ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకు తారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో చూచి వారు విస్మయం చెందుతారు. 17 నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు:
 
“ ‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి.
నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు.
నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి.
కాని నీవు లేకుండా పోయావు!
సముద్రంలో నీవు బలమైనదానవు.
నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు.
నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు
నీవంటే భయపడేలా చేశావు.
18 మరి నీవు పతనమయ్యే రోజున తీర దేశాలు
భయంతో కంపించిపోతాయి.
తీరం వెంబడి నీవెన్నో వాడలు ఏర్పాటు చేశావు.
నీవు పోగానే ఆ ప్రజలు భయభ్రాంతులవుతారు!’ ”
 
19 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరూ, నిన్ను నాశనం చేస్తాను. నీవొక పురాతన పాడుబడ్డ నగరంలా మారతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు. సముద్రం పొంగి నీ మీదికి వచ్చేలా చేస్తాను. ఆ గొప్ప సముద్రం నిన్ను ఆవరిస్తుంది. 20 చనిపోయిన వాళ్లు పోయే పాతాళం లోకి నిన్ను పంపుతాను. ఎన్నడో చనిపోయిన వారిని నీవు కలిసికొంటావు. పాడుబడిన ఇతర పురాతన నగరాలవలె నిన్ను కూడా కింది లోకానికి పంపివేస్తాను. సమాధికి పోయిన ఇతరులతో నీవు కూడా ఉండిపోతావు. అప్పుడు నీలో మరెవ్వరూ నివసించరు. మరెన్నటికీ నీవు నివసించటానికి అనువుకాకుండా పోతావు! 21 నీకు జరిగిన దానిని చూసి ప్రజలు భయపడిపోతారు. నీవు నాశనమవుతావు! ప్రజలు నీకొరకు చూస్తారు; కాని వారు నిన్ను ఇక కనుగొనలేరు!” నా ప్రభువైన యెహోవా చెప్పిన విషయం ఇది.