33
చెడుగు మరింత చెడుగును పుట్టిస్తుంది
మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.
 
దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
“యెహోవా మామీద దయ చూపు నీ సహాయం కోసం మేము కనిపెట్టాం
యెహోవా, ప్రతి ఉదయం మాకు బలం దయచేయి.
మేం కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు.
నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక వారు నీ దగ్గర్నుండి పారిపోతారు.
నీ మహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్టు చేస్తుంది.”
 
మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సందర్భంలాగా వుంటుంది.
యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.
యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు యెహోవాను గౌరవిస్తావు. అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు.
కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. రోడ్లు నాశనం అయ్యాయి. వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు. దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.
10 యెహోవా చెబతున్నాడు, “ఇప్పుడు నేను లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజలకు ప్రముఖుడనవుతాను. 11 ప్రజలారా మీరు పనికి మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డిలా, గడ్డిపోచలా ఉన్నాయి. అవి దేనికే పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది. 12 మనుష్యుల ఎముకలుసున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. ప్రజలు ముళ్లకంపల్లా, ఎండిపోయిన పొదల్లా త్వరగా కాలిపోతారు.
13 “దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యాలను గూర్చి వినండి. నాకు దగ్గర్లో వున్న ప్రజలారా, మీరు నా శక్తిని గూర్చి తెలుసుకోండి.”
14 సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బతకగలరు?” అని వారంటున్నారు.
15 మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. 16 ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.
17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు. 18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.
దేవుడు యెరూషలేమును కాపాడుతాడు
20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు. 21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు. 24 అక్కడ జీవించే ఏ మనిషీ “నాకు జబ్బు” అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు క్షమించబడిన ప్రజలు.