17
మీకా విగ్రహాలు
పర్వత దేశమైన ఎఫ్రాయిములో మీకా అనే ఒక వ్యక్తి వుండేవాడు. మీకా తన తల్లితో, “నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” అన్నాడు.
“కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు గాక” అన్నది.
మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల వెండిని తిరిగి ఇచ్చివేశాడు. అప్పుడామె అంది, “నేనీ వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాలి. అందువల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీకే ఇస్తాను.”
కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే తీసుకుని, ఆ వెండిని కంసాలి వానికి ఇచ్చింది. వెండి పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా ఇంట్లో ఉంచబడింది. మీకాకు విగ్రహాలు ఆరాధించే ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారలలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు. (ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తనకేది సరి అని అనిపిస్తే, దానినే చేస్తుండేవాడు).
లేవీ వంశానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. అతను యూదాలోని బేత్లోహేముకి చెందిన వాడు. యూదా వంశస్తులతో అతను నివసిస్తూండేవాడు. మరొక నివాసం కోసం అతను అన్వేషిస్తూ, ప్రయాణం చేస్తూవుండగా, అతను మీకా ఇంటికి వచ్చాడు. ఎఫ్రాయిము పర్వత దేశంలో మీకా ఇల్లు ఉంది. “నీవు ఎక్కడినుంచి వచ్చావు?” అని మీకా అతనిని అడిగాడు.
ఆ యువకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: “నేను లేవీ వంశానికి చెందినవాణ్ణి. యూదాలోని బేత్లెహేమునుంచి వస్తున్నాను. నివసించేందుకు గాను నేనొక చోటు చూస్తున్నాను.”
10 అప్పుడు మీకా అతనితో అన్నాడు: “నీవు నాతో పాటు వుండు. నీవు నాకు తండ్రిగా, నా యాజకునిగా ఉండు. ప్రతి సంవత్సరం నీకు 4 ఔన్సుల వెండి ఇస్తాను. నీకు అన్నవస్త్రాలు కూడా ఇస్తాను.”
మీకా చెప్పినట్లుగా లేవీ వంశపు వాడు చేసాడు. 11 మీకాతో పాటు ఉండేందుకు యువకుడైన లేవీ వంశపువాడు సమ్మతించాడు. ఆ యువకుడు మీకా యొక్క సొంత కొడుకులలో ఒకనిలాగ అయ్యాడు. 12 మీకా అతనిని తన యాజకునిగా ఎంపికచేశాడు. అందువల్ల ఆ యువకుడు యాజకుడయ్యాడు. మీకా ఇంట్లో నివసించ సాగాడు. 13 మీకా ఇలా అన్నాడు, “లేవీ వంశపువాడొకడు నా యాజకునిగా వున్నాడు కనుక యెహోవా ఇప్పుడు నాకు మంచిగా ఉండునని నేను భావిస్తున్నాను.”