11
జోఫరు యోబుతో మాట్లాడటం
అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
 
“ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే!
ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు.
యోబూ, నీకు చెప్పేందుకు
మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా?
నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు,
నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
యోబూ! నీవు దేవునితో,
‘నా నమ్మకాలు సరి యైనవే,
కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి,
నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు.
ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు.
అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో:
దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
 
“యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా?
సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది!
ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి.
కానీ, అది నీవు గ్రహించలేవు!
దేవుడు భూమికంటే గొప్పవాడు,
సముద్రంకంటే పెద్దవాడు.
 
10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే,
ఏ మనిషీ ఆయనను వారించలేడు.
11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు.
దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో,
అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి.
నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు.
నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు.
నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది.
జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు.
దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు.
మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు,
అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు.
వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”