18
యోబుకు బిల్దదు జవాబు
అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
 
“యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు కొంటున్నావు.
కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
 
“అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
అతని పక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
అతడు వేసే ప్రతి అడగు వెనుకా భయం ఉంటుంది.
12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
భయాల రాజును ఎదుర్కొ నేందుకు అతడు నడిపించబడతాడు.
15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16 కింద అతని వేర్లు ఎండిపోతాయి.
పైన అతని కొమ్మలు చస్తాయి.
17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసికోడు.
18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
అతనియింట యింక సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”