29
యోబు తన మాటలు కొనసాగించటం
యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
 
“దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
(నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
నా మార్గం అర తా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
 
“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
న్యాయంనాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.
 
18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బతుకుతాను.
తర్యాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.
 
21 “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు.
నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
22 ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు,
నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
23 నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసేవారు.
అధైర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే వాడిని.
24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను.
తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.