2
చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు:
 
“నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను.
నేను యెహోవా సహాయం అర్థించాను.
ఆయన నా ప్రార్థన ఆలకించాడు!
నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను.
యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా
నీవు నా మొరాలకించావు!
 
“నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు.
తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి.
నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను.
నా చుట్టూ జల ప్రళయం.
‘ఇక నేను చుడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను.
కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను.
 
“సముద్రజలం నన్ను ముంచి వేసింది.
నీరు నా నోటిని మూసివేసింది,
నేను శ్వాస పీల్చు కోలేకుండా ఉన్నాను.
ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను.
సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
పర్వతాల పునాదులున్న చోట,
సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను.
ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను.
కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధి నుండి బయటకు లేపాడు!
ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు!
 
“నా ఆత్మ నిరాశ చెందింది,
అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను.
యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను.
నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు.
 
“కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు.
కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు.
యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది!
యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను.
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను.
నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.”
 
10 అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.