25
భూమికి విశ్రాంతి సమయం
సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది. ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు. మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది.
“భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది. మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
బూరధ్వని చేసే మహోత్సవ కాలము
“ఏడేసి సంవత్సరాల సముదాయంగల ఏడు సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి. 10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 11 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు. 12 అది బూరధ్వని చేసే మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. 13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.
14 “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు. 15 నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. 16 చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. 17 మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి.
18 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 19 మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు.
20 “కానీ ఒకవేళ మీరు, ‘మేము విత్తనాలు చల్లి, పంట కూర్చుకొనకపోతే ఏడో సంవత్సరం తినేందుకు మాకు ఏమీ ఉండదు అనవచ్చు.’ 21 చింతపడకండి. ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల పాటు పంట ఇస్తూనే ఉంటుంది. 22 ఎనిమిదో సంవత్సరంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ ఉంటారు.
ఆస్తి నియమాలు
23 “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు. 24 మనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును కానీ ఎల్లప్పుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబా నిదే అవుతుంది. 25 మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి. 26 తన భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసంబంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. 27 అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఆ లెక్కను ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. ఆ భూమి మరల అతని ఆస్తి అవుతుంది. 28 అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది.
29 “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది. 30 అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు. 31 ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లో గుర్తించ బడుతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి.
32 “అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీయులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును. 33 ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు. 34 అలానే, లేవీయుల పట్టణాల చుట్టు ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్లు అమ్మేందుకు వీల్లేదు. ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి.
బానిసల స్వంతదారులకు నియమాలు
35 “ఒకవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత పేదరికంలో పడవచ్చు. మీరు అతణ్ణి అతిథిలా మీతో జీవింపనియ్యాలి. 36 మీరు అతనికి అప్పుగా యిచ్చే మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింపనిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు. 37 అతనికి వడ్డీకి అప్పు ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు గడించేందుకు ప్రయత్నించవద్దు. 38 నేను మీ దేవుడైన యోహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకునివచ్చాను.
39 “ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతణ్ణి ఒక బానిసలా పని చేయించకూడదు. 40 అతడు ఒక కిరాయి పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ కాలం వరకు నీతో ఉంటాడు. 41 తర్వాత అతడు నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి పొందవచ్చును. 42 ఎందుచేతనంటే, వాళ్లు నా సేవకులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను తీసుకొనివచ్చాను. వాళ్లు మరల బానిసలు కాకూడదు. 43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి.
44 “నీ స్త్రీ, పురుష బానిసల విషయం: మీ చుట్టు పక్కల దేశాలనుండి ఆడ, మగ బానిసలను మీరు తెచ్చుకోవచ్చును. 45 మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు. 46 ఈ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించవచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీయుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కఠినంగా పాలించగూడదు.
47 “ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్యధనికుడు కావచ్చు, ఒకవేళ మీ దేశంలో ఒకడు దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు పోయాడనుకోండి. 48 ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును. 49 అతని పినతండ్రిగాని, పిన తండ్రి కుమారుడు గాని అతణ్ణి కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి ఎవరైనా అతణ్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును.
50 “వెల మీరెలా నిర్ణయిస్తారు? అతడు విదేశీయునికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవత్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి వ్యక్తి యితణ్ణి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే ‘కిరాయికి’ పెట్టుకొన్నాడు. 51 బూరధ్వని చేసే మహోత్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, ఆ వ్యక్తి వెలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా సంవత్సరాల సంఖ్యమీద ఆధారపడి ఉంటుంది. 52 ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వెలలో కొద్ది మాత్రమే చెల్లించాలి. 53 అయితే ఆ వ్యక్తి కిరాయి పని వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా ప్రవర్తించకుండును గాక.
54 “ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు. 55 ఎందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను!