సంఖ్యాకాండము
1
ఇశ్రాయేలు ప్రజలు లెక్క
సన్నిధి గుడారంలో మోషేతో యెహోవా ఇలా మాట్లాడాడు. ఇది సీనాయి అరణ్యంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు అది, మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలందరి సంఖ్యను లెక్కించు. ప్రతి పురుషుని పేరు అతని వంశం, కుటుంబంతో పాటు జాబితా చేయి ఇశ్రాయేలు పురుషులందరినీ, నీవు, అహరోను లెక్కించాలి. 20 సంవత్సరాలు, అంతకు ఎక్కువ వయస్సు ఉన్న వారిని మీరు లెక్కించాలి. (వారు ఇశ్రాయేలు సైన్యంలో ఉండదగిన వాళ్లు.) వారి వంశాల ప్రకారం వారి జాబితా చేయి. ప్రతి కుటుంబము నుండి ఒక మనిషి మీకు సహాయం చేస్తాడు, ఈ మనిషి తన వంశానికి నాయకుడుగా ఉంటాడు, మీతో ఉండి మీకు సహాయం చేసే పురుషుల పేర్లు ఇవి;
 
రూబేను వంశంనుండి-షెదేయూరు కుమారుడు ఎలీసూరు;
షిమ్యోను వంశంనుండి—సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు
యూదా వంశంనుండి అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
ఇశ్శాఖారు వంశంనుండి సూయారు కుమారుడు నెతనేలు.
జెబూలూను వంశంనుండి హెలోను కుమారుడు ఎలీయాబు.
10 యోసేపు సంతానమందు ఎఫ్రాయిము వంశంనుండి
అమిహూదు కుమారుడు ఎలీషామాయు మనష్షే వంశంనుండి
పెదాసూరు కుమారుడు గమలీయేలు.
11 బెన్యామీను వంశంనుండి గిద్యోనీ కుమారుడు అబీదాను.
12 దాను వంశంనుండి అమీషద్దాయి కుమారుడు అహీయెజెరు.
13 ఆషెరు వంశంనుండి ఒక్రాను కుమారుడు పగీయేలు.
14 గాదు వంశంనుండి దెయూవేలు కుమారుడు ఎలాసాపు;
15 నఫ్తాలి వంశంనుండి ఏనాను కుమారుడు అహీర.”
 
16 ఈ పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, వారి వంశాలకు నాయకులుగా కూడా, ప్రజలు ఈ పురుషులను ఏర్పటు చేసుకొన్నారు. 17-18 పేరు పేరునా ఈ పురుషులు ఏర్పరచుకోబడ్డారు. కనుక రెండవ నెల మొదటి రోజున ఈ పురుషులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే అహరోనులు పిలిచారు. అప్పుడు ప్రజలు వారి కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం జాబితా చేయబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకు పై బడిన పురుషులు అంతా జాబితాలో ఉన్నారు. 19 సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సీనా అరణ్యంలో ఉన్నప్పుడే మోషే వారిని లెక్కించాడు.
 
20 ఇశ్రాయేలు జ్యేష్ఠకుమారుడు రూబేను యొక్క సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు వ్రాయబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో కూడ జాబితాలో చేర్చబడ్డారు. 21 రూబేను సంతతినుండి లెక్కించబడిన పురుషుల సంఖ్య మొత్తం 46,500.
 
22 షిమ్యోను సంతతి లెక్కించబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 23 షిమ్యోను సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 59,300.
 
24 గాదు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె, ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 25 గాదు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 45,650.
 
26 యూదా సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 27 యూదా సంతతి నుండి లెక్కించబడ్డ పురుషులు మొత్తం 74,600.
 
28 ఇశ్శాఖారు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు కలిగి ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 29 ఇశ్శాఖారు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 54,400.
 
30 జెబులూను సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతోబాటు జాబితాలో చేర్చబడ్డారు. 31 జెబులూను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 57,400.
 
32 యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు. 33 ఎఫ్రాయిము సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 40,500.
 
34 యోసేపు కుమారుడైన మనష్షే సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 35 మనష్షే సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 32,200.
 
36 బెన్యామీను సంతతి లెక్కించబడింది, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 37 బెన్యామీను సంతతితో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400.
 
38 దాను సంతతి లెక్కించబడింది. 20 సంవ త్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 39 దాను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 62,700.
 
40 ఆషేరు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 41 ఆషేరు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 41,500.
 
42 నఫ్తాలి సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు. 43 నఫ్తాలి సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 53,400.
 
44 ఈ పురుషులందర్నీ మోషే, అహరోను ఇశ్రాయేలు పెద్దలు లెక్కించారు. (పన్నెండుమంది నాయకులు, ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉన్నారు.) 45 ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగల ప్రతి పురుషుడు లెక్కించబడ్డాడు. అ పురుషులు వారి వంశాలతో బాటు లెక్కించబడ్డారు. 46 పురుషుల సంఖ్య మొత్తం 6,03,550.
47 లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో ఇతరులతో బాటు జాబితాలో లెక్కించబడలేదు. 48 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు. 50 ఒడంబడిక పవిత్ర గుడారానికి వారు బాధ్యులని లేవీ మనుష్యులతో చెప్పు. దాని విషయం, దానితోబాటు ఉండె వాటన్నింటి విషయం, వారు జాగ్రత్త తీసుకోవాలి. పవిత్ర గుడారాన్ని, దానిలో ఉండే వాటన్నింటినీ వారు మోయాలి. వారి నివాసం దాని చుట్టు ఏర్పపరచుకొని, దానినిగూర్చి జాగ్రత్త తీసుకోవాలి. 51 పవిత్ర గుడారం ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మనుష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్రగుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడారాన్ని గూర్చి శ్రద్ధ తీసుకునేందుకు ప్రయత్నిస్తే, అతడు చంపివేయబడతాడు. 52 ఇశ్రాయేలు ప్రజలు వేరు వేరు వంశాలుగా వారి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మనిషీ తన కుటుంబ ధ్వజానికి దగ్గరగా డేరాలు వేయాలి. 53 అయితే లేవీ ప్రజలు పవిత్ర గుడారం చుట్టూ డేరాలు వేయాలి. ఒడంబడిక పవిత్ర గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర గుడారాన్ని కాపాడుతారు.”
54 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విషయాలన్నింటిలో ఇశ్రాయేలీయులు విధేయులయ్యారు.