13
గూఢచారుల కనాను వెళ్లటం
మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”
కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు. వారి పేర్లు ఇవి:
 
రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.
షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.
యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.
ఇఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.
ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.
బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.
10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.
11 మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.
12 దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.
13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.
14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.
15 గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.
 
16 ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)
17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి. 18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా? 19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా? 20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).
21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు. 22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు. 23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. 24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు* ఎష్కోలు దీని అర్థం “ద్రాక్ష గుత్తి.” అని పిలువబడింది.
25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. 26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. 27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో. 28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము. 29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యోర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”
30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.
31 కానీ అతనిలో కూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు. 32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలకు చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనుపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”

*13:24: ఎష్కోలు దీని అర్థం “ద్రాక్ష గుత్తి.”