8
సంగీత నాయకునికి. గితీత్ రాగం. దావీదు కీర్తన.
యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!