౧౩
౧ దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో, ౨  “ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి, ౩ మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు” అన్నాడు. ౪ ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.
౫ దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు. ౬ కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
౭ వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు. ౮ దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
౯ వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు ౧౦ యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు. ౧౧ యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.
౧౨ ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?” అన్నాడు. ౧౩ కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు. ౧౪ దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.