పౌలు అపొస్తలత్వం సమర్థన
౧ నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా? ౨ నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు. ౩ నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే. ౪ తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా? ౫ మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? ౬ బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?
సువార్త ప్రకటించేవారి జీవనోపాధి సువార్త వల్లనే
౭ ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు? ౮ ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా? ౯  “ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది? ౧౦ నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి. ౧౧ మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.
౧౨ వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం. ౧౩ దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?
౧౪ అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు. ౧౫ అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు. ౧౬ నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
౧౭ దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. ౧౮ అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.
నిజమైన సేవావిధానం, ప్రతిఫలం
౧౯ నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. ౨౦ యూదుల్ని సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. ౨౧ దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. ౨౨ బలహీనుల్ని సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. ౨౩ సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
౨౪ పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. ౨౫ అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
౨౬ కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. ౨౭ ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.