౧ బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు. ౨ ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు. ౩ దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. ౪ అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు “అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
౫ ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి “నన్ను పిలిచావు గదా, వచ్చాను” అన్నాడు. ఏలీ “నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు. ౬ యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి “అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను” అన్నాడు. అందుకు అతడు “బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అని చెప్పాడు.
౭ అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. ౮ యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి “అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను” అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు.
౯ అతడు “నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, ‘యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి’ అని చెప్పు” అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు.
౧౦ తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా “సమూయేలూ సమూయేలూ” అని పిలిచినప్పుడు సమూయేలు “నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి” అన్నాడు. ౧౧ అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి.
౧౨ ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను. ౧౩ తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వతశిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను. ౧౪ కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.”
౧౫ తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు. ౧౬ అయితే ఏలీ “సమూయేలూ, కుమారా” అని సమూయేలును పిలిచాడు. అతడు “చిత్తం, నేనిక్కడ ఉన్నాను” అన్నాడు.
౧౭ ఏలీ “నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక” అనగా, ౧౮ సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ “చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక” అన్నాడు.
౧౯ సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. ౨౦ కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు. ౨౧ షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్ష పరచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయింది.